[ad_1]
రావణుడు ఎత్తుకెళ్లిన సీతను రక్షించడానికి రాముడు కట్టిన రామసేతు గురించి విన్నాం… కానీ, ఇప్పుడు సీతే… ప్రజల్ని కాపాడేందుకు ఉరకలెత్తుతున్న వరద మీద వారధి కట్టింది! అలాగని ఇదేమీ రామాయణ గాథ కాదు… కేరళ కొండచరియల బాధితులను రక్షించేందుకు భారతసైన్యాధికారిణి మేజర్ సీతా షెల్కే చేసిన కృషి. అందుకే, ఆమె పేరు మారుమోగుతోంది. ఈ పనిలో కీలకంగా వ్యవహరిస్తోన్న మద్రాస్ ఇంజినీర్ గ్రూప్‌కి నాయకత్వం వహించిన ఏకైక మహిళా అధికారిణిగా జనమంతా ఆమెకు జేజేలు పలుకుతున్నారు.
పశ్చిమ కనుమల్లో పుట్టిన ప్రళయానికి కేరళలోని వయనాడ్…అల్లకల్లోలమైంది. పెద్ద ఎత్తున పేరుకున్న బురద, పొంగిపొర్లుతోన్న వాగులూ, కొట్టుకుపోయిన వంతెనలు… రెస్క్యూ టీమ్‌లు బాధితుల్ని చేరుకునే వీలు లేకుండా చేస్తున్నాయి. అప్పుడే సీతా షెల్కే సివంగిలా దూసుకొచ్చారు. మరో అధికారి అనీశ్‌తో కలిసి పరిస్థితులను అంచనా వేశారు. తాత్కాలిక వంతెనలు(బెయిలీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. వీటిని నిర్మించేందుకు సీత ఆధ్వర్యంలో ఆర్మీకి చెందిన మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్ పనిలోకి దిగింది. ముందుగా ముందక్కై, చురాల్‌మలను కలిపే ఈ నిర్మాణానికి అవసరమైన విడిభాగాలను హెలీకాప్టర్లూ, ట్రక్కుల్లో వరద ప్రభావిత ప్రాంతానికి తరలించారు అవి అక్కడికి చేరుకునేసరికి సాయంత్రం అయినా, ఆ చిమ్మ చీకటి, జోరువానల మధ్యనే వంతెన నిర్మాణం చేపట్టి నిర్విరామంగా పనిచేశారు. జూలై 31 రాత్రి 9 గంటలకు ప్రారంభించి… మర్నాడు సాయంత్ర 5.30 గంటలకల్లా వంతెన పూర్తి చేసేశారు. 24 టన్నుల సామర్థ్యంతో 190 అడుగుల పొడవైన వంతెనను అంత త్వరగా నిర్మించడం అంత సులువేం కాదు. పైగా ప్రతికూల వాతావరణం. ఈ సమయంలో సీత అసాధారణ నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించారు. అందుకే ఆమెను సోషల్‌మీడియా సూపర్ హీరోగా కీర్తిస్తోంది. ఈ బెయిలీ వంతెన నిర్మాణం… ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు, శోధనా కార్యకలాపాల్లో కీలకమైన అడుగులు వేయడానికి సాయపడుతుంది. జాడలేని బాధితులను గుర్తించే వీలు కలుగుతుంది. క్లిష్టమైన పరిస్థితుల్లో తనదైన సమయస్ఫూర్తి చూపించిన మేజర్ సీత మాత్రం…‘నన్ను మహిళగా చూడొద్దు. నేనో సైనికురాల్ని. భారతసైన్యం ప్రతినిధిగా నా విధులు నిర్వర్తిస్తున్నా’ అని చెప్పడం ఆమె నిరాడంబరతకు నిదర్శనం.
సివిల్స్ సాధించాలనుకుని…
బెంగళూరులోని మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్(ఎంఈజీ)లో మేజర్ సీతా షెల్కే ఏకైక మహిళాధికారి. ఈ బృందాన్నే మద్రాస్ సాపర్స్‌గా పిలుస్తారు. ఈ ఇంజినీరింగ్ యూనిట్…సైన్యంకోసం మార్గాలను క్లియర్ చేయడం, వంతెనలు నిర్మించడం, యుద్ధ సమయంలో ల్యాండ్‌మైన్‌లను గుర్తించడం వంటివి చేస్తుంది. అంతేకాదు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రెస్క్యూ ఆపరేషన్లలోనూ భాగమవుతారు. సీతది మహారాష్ట్రలోని గాడిల్‌గావ్. తండ్రి అశోక్ బిఖాజీ షెల్కే న్యాయవాది. మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన సీత ఐపీఎస్ కావాలనుకున్నారు. సరైన మార్గదర్శకత్వం లేక ఆ లక్ష్యం చేరలేకపోయారు. దాంతో భారత సైన్యంలో చేరడంపై దృష్టి సారించారు. రెండుసార్లు సశస్త్ర సీమాబల్(ఎస్‌ఎస్‌బీ)పరీక్షలో విఫలమయ్యారు. అయినా, నిరుత్సాహపడకుండా పట్టుదలతో మూడో ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించారు. ఆపై చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుని 2012లో సైన్యంలో చేరారు. శారీరక బలహీనతలు, మానసిక ఉద్వేగాలు, ప్రతికూల పరిస్థితులను తట్టుకుని, మగవారికి దీటుగా మహిళలూ రాణించగలరనడానికి మేజర్ సీతా షెల్కే సరైన ఉదాహరణ కదూ.
[ad_2]
Source link