[ad_1]
మరో 49 మంది మహిళలతో చాటింగ్
అరెస్టయిన సత్యజిత్
భువనేశ్వర్, న్యూస్‌టుడే: ఆయనో నయవంచకుడు. అయిదు పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా మరో 49 మంది మహిళలతో ప్రేమపేరుతో చాటింగ్ చేస్తున్నాడు. పెళ్లి చేసుకున్నవారి సంపాదనతో జల్సాగా తిరుగుతున్నాడు. ఈ ఘరానా మోసగాన్ని భువనేశ్వర్ కమిషనరేట్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కమిషనర్ సంజీవ్పండా విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం… జాజ్‌పూర్ జిల్లా బింజారపూర్కి చెందిన మానగోవిందసామల్ అలియాస్ సత్యజిత్ ఉద్యోగాన్వేషణ పేరిట ఆరేళ్ల క్రితం భువనేశ్వర్ వచ్చాడు. ‘మేట్రిమొనీ’ (వివాహవేదిక)లో తన వివరాలు నమోదు చేసుకున్నాడు. యవ్వనంలో ఉన్న వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలకు ఎరవేశాడు. తొలుత ఇద్దరు ఉద్యోగినులను ప్రేమలోకి దించి వివాహం చేసుకున్నాడు. వారి సొమ్ముతో కారు కొనుగోలు చేశాడు. విలాసాలకు అలవాటు పడి వారిద్దరినీ బెదిరించి వారి పేర్ల మీద బ్యాంకు రుణాలు తీసుకుని దుబాయ్ వెళ్లిపోయాడు. తర్వాత మేట్రిమొనీలోని యువతుల వివరాలు తెలుసుకొని మరో ముగ్గుర్ని పెళ్లి చేసుకున్నాడు. వారి సంపాదనతో తరచూ యూఏఈ, దుబాయ్‌లలో పర్యటించేవాడు. ఆయన గురించి ఆలస్యంగా తెలుసుకుని నిలదీసిన భార్యలను పిస్తోలుతో బెదిరించాడు. మరో 49 మంది మహిళలతో ప్రేమ అంటూ చాటింగ్ చేసిన వివరాలు ఆయన సెల్ఫోన్ల ద్వారా పోలీసులు సేకరించారు. మరోవైపు ఆయన మోసగించిన ఇద్దరు రెండు నెలల క్రితం పోలీసు కమిషనర్ సంజీవ్‌కు ఫిర్యాదు చేశారు. సత్యజిత్ దుబాయ్‌లో ఉన్నట్లు తెలిసిన సంజీవ్ భువనేశ్వర్ కేపిటల్ ఠాణాకు చెందిన ఒక మహిళా ఎస్సైని రంగంలోకి దించారు. ఆమె సత్యజిత్‌తో చాటింగ్ చేస్తున్నట్లు నటించి తనతో డేటింగ్‌కు రావాలని ఆహ్వానించారు. దీంతో ఆమె చెప్పిన కల్పనా కూడలికి సత్యజిత్ శనివారం ఉదయం వచ్చాడు. అక్కడ కాపుకాసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
కమిషనర్ సంజీవ్ పండా
ఐబీ ఇన్స్పెక్టర్గా చెప్పుకొని…
ఇంటిలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఇన్స్పెక్టరుగా పరిచయం చేసుకున్న సత్యజిత్ తాను ఆదర్శవాదిగా చెప్పుకుని అయిదుగుర్ని వివాహం చేసుకున్నట్లు కమిషనర్ చెప్పారు. కోల్‌కతా, దిల్లీ నగరాలకు చెందిన మరి కొంతమంది మహిళల్ని మోసగించినట్లు ప్రాథమికంగా తెలిసిందన్నారు. ఆయన ప్రేమ పేరిట లొంగదీసుకున్న మహిళలంతా వితంతవులు, విడాకులు తీసుకున్నవారేనని వివరించారు. ‘ఆపరేషన్ మజ్ను’ పేరిట తాము ఈ మహా మోసగాడ్ని అరెస్ట్ చేశామని, సత్యజిత్‌ను రిమాండ్‌లోకి తీసుకుని ఆయన ద్వారా వంచనకు గురైన ఇతర మహిళల వివరాలు సేకరిస్తామన్నారు. ఇంతవరకు వివాహాలు చేసుకున్న అయిదు ఒప్పందాలను స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ చెప్పారు.
[ad_2]
Source link